Pancreatic Cancer | హ్యూస్టన్, జనవరి 31: ప్రాణాంతక పాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సకు అమెరికాలోని రైస్ యూనివర్సిటీ పరిశోధకులు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. పాంక్రియాటిక్(క్లోమ గ్రంధి) క్యాన్సర్ కణతులు చిన్న పేగు వంటి కీలకమైన అవయవాలకు సమీపంలో ఏర్పడతాయి. దీంతో అధిక డోస్‌తో రేడియేషన్ థెరపీ చేయడం వల్ల తీవ్రమైన జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కణతుల సమీపంలోని ఆరోగ్యకర కణజాలానికి నష్టం కలుగుతుంది. అయితే, ఆమైఫోస్టిన్ అనే ఔషధం రేడియేషన్ థెరపీ చేస్తున్నప్పుడు ఆరోగ్యకర కణజాలానికి రక్షణనిస్తుంది.
ఇప్పటివరకు సిరల ద్వారా ఇచ్చే ఈ ఔషధం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటున్నందున ఎక్కువగా వినియోగించడం లేదు. నోటి నుంచి ఈ ఔషధాన్ని ఇస్తే కడుపులోని ఆమ్లాలు దాని ప్రభావాన్ని తగ్గించేస్తాయి. దీంతో రైస్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ ఔషధాన్ని ముక్కు నుంచి ఇచ్చే పద్ధతిని తయారు చేశారు. ఒక ట్యూబ్ ద్వారా నేరుగా ముక్కు నుంచి జీర్ణ వాహిక పై భాగానికి అందించవచ్చని వీరు చెప్తున్నారు. తద్వారా రేడియేషన్ థెరపీ సమయంలో ఆరోగ్యకర కణజాలానికి కలిగే నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. ఈ పద్ధతిని ఎలుకలపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయని చెప్పారు.