కాఠ్మాండూ : వరద విలయంతో అతలాకుతలమైన నేపాల్, టిబెట్లలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 26న సంభవించిన విపత్తులో గల్లంతైన వారికోసం తొమ్మిది రోజుల తర్వాత కూడా గాలింపు కొనసాగుతున్నది. కాగా, వరదల కారణంగా సొరంగంలో చిక్కుకున్న ఇద్దరిని భద్రతా బలగాలు రక్షించాయి.
రసువా జిల్లా త్రిశూలి-3ఏ హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద సొరంగం నుంచి మాటలు వినిపిస్తున్నట్టు కొందరు సామాజిక మాధ్యమంలో పేర్కొనడంతో సిబ్బంది అప్రమత్తమై సొరంగంలోని బురదను తొలగించగా ఇద్దరు సజీవంగా కన్పించడంతో వారిని బయటకు తీసుకువచ్చారు. వారిద్దరినీ మెకానికల్ ఫోర్మెన్ సంజయ్ సాహ్, మెకానికల్ సూపర్వైజర్ కబీర్ మహర్జన్గా గుర్తించారు. వరద విలయంలో త్రిశూలి-3ఏ కేంద్రంలో 40 మంది గల్లంతైనట్టు అధికారులు ప్రకటించారు.