RAT in flight : బాంబు బెదిరింపు కారణంగానో, విమానంలో ఎవరైనా అస్వస్థతకు గురైతేనో, విమానాన్ని పక్షి ఢీకొడితేనో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. ఒక చిన్న ఎలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా..? కానీ నార్వేలో అదే జరిగింది. చిట్టెలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
నార్వేలోని ఓస్లో నుంచి స్పెయిన్‌లోని మాలాగాకు స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానం బయలుదేరింది. ప్రయాణికులకు విమాన సిబ్బంది భోజనం ప్యాకెట్లు అందించారు. ఓ ప్రయాణికురాలు తన భోజనం ప్యాకెట్ విప్పి షాక్‌కు గురైంది. ఎందుకంటే ఆ ప్యాకెట్లో నుంచి ఓ చిట్టి ఎలుక బయటకు దూకింది. కళ్లు తెరిచి మూసేలోగా ఆ చిట్టెలుక పారిపోయింది.
అంతే విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది సైతం నానా హైరానా పడ్డారు. ఆ చిట్టెలుక విమానంలోని వైర్లను కొరికితే తమ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయేవని వారంతా ఆందోళన వ్యక్తంచేశారు. విమాన సిబ్బంది ఓస్లో ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులకు జరిగిన ఘటనను గురించి వివరించారు. వారి సూచన మేరకు కోపెన్‌హాగన్‌కు విమానాన్ని మళ్లించారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని ల్యాండ్ చేశారు.
అనంతరం విమానంలోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపినట్లు స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది భద్రత తమకు అత్యంత ముఖ్యమని ఆ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. అదే విధంగా ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని చెప్పారు. విమానంలో ఎలుక కోసం ముమ్మరంగా గాలించినట్లు తెలిపారు. ఆహారం సరఫరా చేసిన సంస్థను విచారిస్తామన్నారు.