న్యూఢిల్లీ, జూలై 15: పీడకలలను మనం పెద్దగా పట్టించుకోం. సంతోషాన్ని కలిగించే కలల మాదిరిగా అవి కూడా జీవితంలో భాగమేనని తేలికగా తీసిపారేస్తుంటాం. కానీ, దీర్ఘకాలంలో పీడకలలు మనపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని తాజా అధ్యయనంలో తేలింది. తరచుగా పీడకలలు వచ్చే వ్యక్తుల్లో ముసలితనం త్వరగా పెరుగుతుందని యూరోపియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ పరిశోధకులు తేల్చారు. తరచుగా పీడకలలు రాని ఒకే వయసు వ్యక్తులతో పోలిస్తే అధికంగా పీడకలలు వచ్చే వ్యక్తుల్లో వృద్ధాప్యం గణనీయ స్థాయిలో వేగవంతమవుతుందని స్పష్టం చేశారు.
ఆరోగ్య పరిశోధనలో భాగంగా అమెరికాలో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు లండన్లోని ఇంపీరియల్ కాలేజీ బ్రెయిన్ సైన్సెస్ విభాగంలో క్లినికల్ రిసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్న డాక్టర్ అబిదెమీ ఒతైకు వివరించారు.
పీడకలలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో 8 నుంచి 10 ఏండ్లలోపు వయసున్న 2,429 మంది పిల్లలతోపాటు 26 నుంచి 86 ఏండ్ల వయసున్న 1,83,012 మంది వయోజనులు పాల్గొన్నట్టు తెలిపారు. వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువసార్లు పీడకలలు వచ్చే వ్యక్తులు 70 ఏండ్లలోపే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు.
పోషకాహార లోపం, ఊబకాయం, ధూమపానం కంటే పీడకలలే అకాల మరణాలకు బలంగా దారితీస్తాయని గుర్తించినట్టు పేర్కొన్నారు. పీడకలలు వచ్చేవారికి దీర్ఘకాలిక వ్యాధులు అధికంగా ఉంటాయని, ఈ కారకాలను తొలగించినప్పటికీ పీడకలలకు అకాల మరణాలకు మధ్య సంబంధం గణనీయంగానే ఉంటుందని ఒతైకు చెప్పారు.