మాస్కో, ఆగస్టు 21: రష్యా అధ్యక్షుడు పుతిన్ మెదడుగా చెప్పుకునే జాతీయ సిద్ధాంతకర్త అలెగ్జాండర్ దుగిన్ కుమార్తె దారియా దుగినా (29) హత్యకు గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనం పేలడంతో ప్రాణాలుకోల్పోయారు. ఈ ఘటన శనివారం రాత్రి రాజధాని మాస్కో శివారులో చోటుచేసుకుంది. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనడానికి కారులో తండ్రి కుమార్తె కలిసి వెళ్లారు.
అనంతరం తిరిగి వచ్చేటప్పుడు చివరి నిమిషంలో అలెగ్జాండర్ వేరేకారులో వస్తానని చెప్పడంతో దుగినా ఒక్కరే ఎస్యూవీలో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కారు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో దుగినా అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయారు. కారులో బాంబు అమర్చడంతోనే పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే ఈ బాంబును ఎవరు అమర్చారు? ఎవరిని చంపాలనుకున్నారు? అన్న విషయాలు మాత్రం వెల్లడికాలేదు. కాకపోతే ఉక్రెయిన్పై యుద్ధంలో అలెగ్జాండర్ కీలకపాత్ర పోషించారని, ఈ హత్య వెనుక ఆ దేశం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. కాగా, కొద్దికాలం నుంచి రష్యాలో ఉన్నతస్థాయి వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మరణిస్తున్న విషయం తెలిసిందే.