కీవ్, ఫిబ్రవరి 27: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఏదో ఒక రోజు ఆయన సన్నిహితులే హత్య చేస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ‘ఇయర్’ పేరుతో రూపొందించిన ఉక్రెనియన్ డాక్యుమెంటరీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ‘న్యూస్వీక్’ పత్రిక వెల్లడించింది.
ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఈ డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఇందులో జెలెన్స్కీ కూడా నటించారు. రష్యాలో పుతిన్ నాయకత్వం బలహీనపడే సమయం ఆసన్నమైందని, దీంతో పుతిన్ను ఆయన అనుచరులే చంపేస్తారని జెలెన్స్కీ పేర్కొన్నట్టు ‘న్యూస్ వీక్’ తెలిపింది. పుతిన్ పట్ల ఆయన అంతరంగికుల్లో అసహనం పెరుగుతున్నట్టు ఇటీవల ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించిన నేపథ్యంలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిమియా ద్వీపకల్పాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకొన్నాకే యుద్ధం ముగుస్తుందని అన్నారు. ‘ఇది మా భూమి.. మా ప్రజలు.. మా చరిత్ర.. ఉక్రెయిన్లోని ప్రతి మూలనా మళ్లీ మా జెండా ఎగురుతుంది’ అని జెలెన్స్కీ ఆదివారం ట్విట్టర్లో పేర్కొన్నారు.