మాస్కో, ఫిబ్రవరి 24: పశ్చిమదేశాలు కొన్నివారాలుగా చెప్తున్న జోస్యాలను నిజం చేస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ మీదకు గురువారం సేనలను పంపారు. దురాక్రమణ యుద్ధాలకు కాలం చెల్లిందన్న రోజుల్లో పొరుగు దేశంపైకి సేనలను పంపిన పుతిన్ గతచరిత్రను ఒకసారి చూద్దాం..
1. అప్పటి లెనిన్గ్రాడ్, ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 1952లో జన్మించిన పుతిన్ 1975లో రష్యా గూఢచార సంస్థ కేజీబీలో చేరారు. సోవియట్ యూనియన్ పతనం తర్వాత క్రెమ్లిన్ అధికార సౌధంలోకి అడుగుపెట్టారు.
2. బోరిస్ ఎల్చిన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1999లో ఏడాదిపాటు ప్రధానిగా నియమితులయ్యారు. 2000 సంవత్సరంలో అధ్యక్ష పదవి చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఏదోరకంగా అధికారంలో కొనసాగుతున్నారు.
3. రష్యా రాజ్యాంగం అధ్యక్ష పదవికి రెండు విడతల పరిమితి విధించడంతో డిమిట్రీ మెద్వెదెవ్‌తో ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో అధికారంలో కొనసాగారు. అధ్యక్ష, ప్రధాని పదవులను ఇద్దరూ మార్చిమార్చి చేపట్టారు.
4. 2012లో అధ్యక్షునిగా తిరిగి ఎన్నికైన తర్వాత రెండేండ్లకు ఉక్రెయిన్‌లో భాగమైన క్రిమియాను రష్యాలో కలిపేసుకున్నారు.
5. 2013 నుంచి 2016 మధ్యకాలంలో నాలుగుసార్లు పుతిన్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన నేతగా ఎంపికయ్యారు.
6. 2017లో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారని, డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యేలా కుట్రలు జరిపారని పుతిన్‌పై ఆరోపణలు వచ్చాయి.
7. 2018 మార్చిలో పుతిన్ రష్యా అధ్యక్షునిగా నాలుగోసారి ఎన్నికయ్యారు.
8. 2024లో అధ్యక్ష పదవి గడువు ముగిసిన తర్వాత కూడా అధికారంపై తన పట్టును నిలబెట్టుకునేందుకు పుతిన్ 2020 జనవరిలో రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించారు. 2036 వరకు తానే అధ్యక్షుడిగా ఉండేలా సవరణలు చేశారు.