Elon Musk | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకు మంచి మిత్రుడు కాదని ట్విట్టర్ చీఫ్ ఎలన్‌మస్క్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఎలన్‌మస్క్ నిలిచారు. ప్రత్యేకించి తన స్టార్‌లింక్ శాటిలైట్ ద్వారా ఉక్రెయిన్ వాసులకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చారు ఎలన్‌మస్క్. దీంతో ఆయనకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభించాయి. ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచినందుకే తనను పుతిన్ యుద్ధ నేరస్తుడని పిలిచారన్నారు. ట్విట్టర్లో రష్యన్లకు ఎందుకు అనుమతి ఇస్తారని ఓ యూజర్ అడిగిన ప్రశ్నపై ఎలన్‌మస్క్ పై విధంగా స్పందించారు.
`ఉక్రెయిన్‌కు సాయం చేసినందుకు పుతిన్.. నన్ను యుద్ధ నేరస్థుడని పేర్కొన్నట్లు తెలిసింది. అందుకే ఆయన నాకు మంచి మిత్రుడు కాదు. అన్ని వార్తల్లోనూ కొంత దుష్ప్రచారం ఉంటుంది. దానిపై ప్రజలే నిర్ణయించుకోవాలి` అని ఎలన్‌మస్క్ తెలిపారు. ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ అవసరం లేదని, ప్రపంచ చిత్రపటం నుంచి అదృశ్యం అవుతుందని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రీ మెద్వెదేవ్ ఇటీవల ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ వాసులు కూడా నాజీ నేతృత్వంలోని ఉక్రెయిన్ పాలనను కోరుకోవట్లేదని చేసిన ట్వీట్‌ను కోటి మందికి పైగా వీక్షించారు. ఇటువంటి ట్వీట్లు చేసే రష్యన్లను ఎందుకు ట్విట్టర్లో అనుమతిస్తారని ఎలన్‌మస్క్‌ను ఓ యూజర్ ప్రశ్నించారు. దీనిపై ప్రజలే నిర్ణయించుకుంటారని ఎలన్‌మస్క్ రిప్లయ్ ఇచ్చారు.
గతేడాది రష్యా సైనిక దాడులు మొదలైన తర్వాత ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్ సేవలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. దీంతో ఉక్రెయిన్ వాసులకు సమాచారం అందించడం కీలకమైంది. ఈ సమయంలో తన స్టార్‌లింక్ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించారు. అందుకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఎలన్మస్క్పై ప్రశంసలు కురిపించారు.