లండన్, నవంబర్ 26 : గ్రహశకలాలు భూమిని ఢీకొడితే సంభవించే విపత్తును అంచనా వేయడం కూడా కష్టమే. అరుదుగా ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఊహనే ఆందోళన కలిగిస్తుంది. అత్యంత కచ్చితత్వంతో గ్రహశకలాల గమనాన్ని గుర్తించి, భూమికి ప్రమాదాన్ని దూరం చేసేందుకు స్పెయిన్లోని ముర్సియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ బార్కో నొవిల్లో కొత్త ఆలోచనను ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన వివరాలు రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. గ్రహశకలాల కక్ష్యను అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం కోసం ప్రొఫెసర్ నొవిల్లో బుధగ్రహంపై ఒక ప్రయోగం చేశారు. సాధారణంగా ఏదైనా వస్తువు నుంచి కాంతి కిరణాలు నేరుగా మన కళ్ల మీద పడతాయి. దీంతో ఆ వస్తువు ఎక్కడ ఉంటే, అక్కడే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎక్కడో దూరాన ఉండే గ్రహశకలాల విషయంలో ఇలా జరగదని, ‘గురుత్వాకర్షణ విక్షేపం’ వల్ల గ్రహశకలాలకు తాకిన కాంతి వంపు తిరుగుతుందని నొవిల్లో చెప్తున్నారు. కాబట్టి, గ్రహశకలాల కక్ష్యను గుర్తించేటప్పుడు గురుత్వాకర్షణ విక్షేపాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, తద్వారా కచ్చితంగా వాటి కక్ష్యను గుర్తించొచ్చని ప్రతిపాదించారు.
భూమిపైకి దూసుకొచ్చే గ్రహశకలాలను అడ్డుకునే సామర్థ్యం, సాంకేతికత ఇప్పటివరకు మనుషుల వద్ద లేదు. ఈ సామర్థ్యం కోసం నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్(డార్ట్) పేరుతో ఓ ప్రయోగం చేస్తున్నాయి. డైమొర్ఫోస్ అనే చిన్న గ్రహశకలాన్ని రీఫ్రిజిరేటర్ సైజులో ఉన్న ఒక వ్యోమనౌకతో ఢీకొట్టించడం ద్వారా దాని కక్ష్యను మార్చాలనేది ఈ ప్రయోగం లక్ష్యం. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ ప్రయోగ ఫలితాలు తెలియనున్నాయి.