ఆరిజోనా: అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. ఆరిజోనాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఆరిజోనాలోని స్కాట్‌డేల్ విమానాశ్రయంలో రెండు ప్రైవేటు జెట్ విమానాలు (Jets Collide) ఢీకొన్నాయి. దీంతో ఒకరు మరణించారు. పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 2.45 (అమెరికా కాలమానం ప్రకారం) లియర్‌జెట్ 35ఏ విమానం ల్యాండింగ్ అయిన తర్వాత రన్‌వే నుంచి జారి రన్‌వేపై ఉన్న బిజినెస్ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ జీ200ను ఢీకొట్టింది. దీంతో విమానాశ్రయంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. గత పదిరోజుల్లో అమెరికాలో ఇది నాలుగో విమాన ప్రమాదం.
ఈ నెల 7న అలస్కాలో ఓ విమానం అదృశ్యమైన విషయం తెలిసిందే. బేరింగ్ ఎయిర్ సంస్థకు చెందిన సెస్నా 208 బీ గ్రాండ్ కారవాన్ మోడల్ విమానం గత శుక్రవారం గల్లంతయింది. ప్రమాద సమయంలో విమానంలో 9 మంది ప్రయాణికులు, పైలట్ ఉన్నారు. అంతకుముందు ఓ ఆర్మీ హెలికాప్టర్, పౌరవిమానం వాషింగ్టన్ సమీపంలో ఢీకొన్నాయి. దీంతో 67 మంది మరణించారు. అదేవింధంగా ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ సమీపంలో ఓ విమానం కుప్పకూలడంతో ఆరుగురు చనిపోయారు.