Prince Harry | ప్రిన్స్ హ్యారీ ఆటోబయోగ్రఫి ‘స్పేర్’ విడుదలైంది. రికార్డు స్థాయిలో పుస్తకాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక్క బ్రిటన్‌లో తొలిరోజున 4 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం అత్యంత వేగంగా అమ్ముడవుతున్న నాన్ ఫిక్షన్ పుస్తకంగా ‘స్పేర్’ నిలిచింది. ఈ పుస్తకంలో బ్రిటన్ రాజకుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను వెల్లడించినట్లు విడుదలకు ముందు మీడియాలో వార్తలుగా రావడంతో ఈ పుస్తకంపై ఆసక్తిపెరిగిపోయింది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ పబ్లిషింగ్ హౌజ్ ప్రచురించింది. గతంలో హ్యారీ పోటర్ పుస్తకం ఒక్కటే ఇంతకన్నా ఎక్కువ అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది.
ప్రిన్స్ హ్యారీ ఇంగ్లండ్ రాజు చార్లెస్ చిన్న కుమారుడు. అతను తన భార్య మేఘన్‌తో కలిసి 2020 లో రాజసౌదాన్ని విడిచిపెట్టాడు. తన జీవితంలో ఎదురైన అనుభవాలను అక్షరబద్దం చేసేందుకు ప్రిన్స్ హ్యారీ పెంగ్విన్ రాండమ్ హౌజ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఘోస్ట్ రైటర్‌తో ఈ పుస్తకాన్ని రాయిస్తున్నారు. ‘స్పేర్’ ఆటోబయోగ్రఫి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బ్రిటన్ రాజకుటుంబ రహస్యాలను తెలిపే ఈ పుస్తకంలోని పలు భాగాలు ఇప్పటికే మీడియాలో లీక్ అయ్యాయి. దాంతో ప్రజలు ఈ పుస్తకాన్ని చదివేందుకు చాలా ఆసక్తితో ఉన్నారు. యూకేలో ఒకరోజు ముందుగా పుస్తక విక్రయాలు మొదలవగా.. అన్ని దుకాణాల వద్ద క్రౌడ్ విపరీతంగా కనిపించింది. పుస్తకాన్ని చేజిక్కించుకునేందుకు రోజంతా క్యూలో నిలబడి ఉన్నారు. ‘స్పేర్’ ధర రూ.2,778 ఉండగా.. యూకేలో సగం ధరకే విక్రయించారు. అమెజాన్‌లో విడుదలైన ఈ పుస్తకం రూ.1,389 కి లభిస్తున్నది.
ఇంగ్లండ్, స్వీడన్‌లోని పుస్తక దుకాణాల్లో బెల్లా మాకీ నవల ‘హౌ టు కిల్ యువర్ ఫ్యామిలీ’ పుస్తకం పక్కనే ప్రిన్స్ హ్యారీ ‘స్పేర్’ పుస్తకాన్ని ప్రదర్శించారు. ప్రిన్స్ హ్యారీ తన పుస్తకంలో రాజ కుటుంబంపై తీవ్రంగా దాడి చేశాడు. తన తండ్రి, సోదరుడు, సవతి తల్లి గురించి చాలా విషయాలు వెల్లడించాడు. దీంతో పలు దుకాణాలు హాస్యాన్ని జోడించేందుకు ప్రిన్స్ హ్యారీ పుస్తకాన్ని ‘హౌ టు కిల్ యువర్ ఫ్యామిలీ’ పక్కనే ఉంచడం పలువుర్ని ఆకట్టుకున్నది. కాగా, తన జ్ఞాపకాలను అందరితో పంచుకునేందుకు ప్రిన్స్ హ్యారీ ఇప్పటికే రూ.164 కోట్ల రాయల్టీని ప్రింటర్స్ నుంచి అందుకున్నాడు. ప్రిన్స్ హ్యారీతో 4 పుస్తకాల కోసం పెంగ్విన్ రాండమ్ హౌజ్ ఒప్పందం చేసుకున్నది. ఇందులో తొలి పుస్తకంగా ‘స్పేర్’ విడుదలవగా.. మరొకటి తన భార్య మేఘన్‌తో కలిసి రాయనున్నారు. మిగిలిన రెండు పుస్తకాల్లో ఒకటి నాయకత్వం, ఇంకొకటి మానవ సంక్షేమానికి సంబంధించినవిగా తెలుస్తున్నది.