Pregnant Gaza Woman | గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ సైన్యం రక్తపుటేరులు పారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఎంతో మందిని నిరాశ్రయులను చేసింది. అంతేకాదు గర్భిణులకు కూడా ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది. తమ ప్రాణాలతో పాటు కడుపులో ఉన్న బిడ్డల ప్రాణాలను కాపాడుకునేందుకు ఎంతో మంది గర్భిణులు వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలో కొందరు చనిపోయి తమ బిడ్డలకు ప్రాణం పోసిన వారున్నారు. కొన్ని సందర్భాల్లో తల్లీబిడ్డలూ మరణించిన ఘటనలు అనేకం. కానీ ఓ గర్భిణి మాత్రం కడుపులో ఉన్న తన నలుగురు బిడ్డలకు ప్రాణం పోసింది. కడుపులో కదలాడుతున్న బిడ్డల ప్రాణాలను కాపాడుకునేందుకు ఆమె పెద్ద సాహసమే చేసింది. ఏకంగా ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లి.. బిడ్డలకు బతికించుకుంది.
అమర్ ఆల్ మెస్రీ(33), ఇమాన్ ఆల్ మెస్రీ(28) దంపతులకు ముగ్గురు సంతానం. మళ్లీ ఆమె గర్భిణి. ఇమాన్ గర్భందాల్చిన ఆరు నెలలకు ఆమె ఉంటున్న ప్రాంతంలో యుద్ధం మొదలైంది. దీంతో తనతో పాటు తన బిడ్డలను రక్షించుకునేందుకు జబలియాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు నడుచుకుంటూ వెళ్లింది. తనతో పాటే తన ముగ్గురు పిల్లలను కూడా వెంట తీసుకెళ్లింది. ఇక డిసెంబర్ 18వ తేదీన సీజేరియన్ ద్వారా నలుగురికి జన్మనిచ్చింది. ఇద్దరు కూతుర్లు కాగా, ఇద్దరు కుమారులు. వారికి టియా, లిన్, యాసీర్, మహ్మద్‌గా నామకరణం చేసింది. అయితే ఆమె ప్రసవించిన రెండు, మూడు రోజులకే ఆస్పత్రి నుంచి వెళ్లిపోవాలని వైద్యులు ఆదేశించారు. ఎందుకంటే యుద్ధంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతోనే కోలుకున్న వెంటనే అందర్నీ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక మహ్మద్ అనే శిశువుకు కేవలం 2.2 కేజీల బరువుతో పుట్టడం వల్ల.. అతన్ని ఆస్పత్రిలోనే ఉంచి ఇమాన్ వెళ్లిపోయింది.
ఇమాన్ తన ఆరుగురు పిల్లలతో కలిసి ఓ స్కూల్ గదిలో నివాసం ఉంటోంది. అక్కడ తన కుటుంబ సభ్యులు 50 మంది దాకా ఉన్నారు. పిల్లలు పడుకునేందుకు కూడా సరైన సౌకర్యాలు లేవని ఇమాన్ వాపోయారు. కేవలం కట్టుబట్టలతోనే ఇంటి నుంచి బయటపడ్డామని చెప్పారు. యుద్ధం ఒకట్రెండు వారాల్లో ముగిసిపోతుందని భావించాం. కానీ ఇలా నెలల తరబడి యుద్ధం కొనసాగుతోందని ఊహించలేదని ఇమాన్ పేర్కొన్నారు. ఇక పిల్లలు పుట్టిన వెంటనే రోజ్ వాటర్‌తో స్నానం చేయించాలని కలలు కన్నానని, కానీ ఆ ఆశలు ఆవిరయ్యాయంటూ కన్నీటి పర్యంతమైంది. కనీసం ఇప్పుడు పిల్లలకు స్నానం చేయిద్దామంటే కూడా నీళ్లు దొరకడం లేదని వాపోయింది. పిల్లలకు స్నానం చేయించక పది రోజులు అవుతోదందని తెలిపింది. సరైన ఆహారం కూడా లభించడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది ఇమాన్. సాధారణంగా పిల్లలకు ప్రతి రెండు గంటలకోసారి డైపర్లు చేంజ్ చేస్తుంటాను. ఇప్పుడేమో ఉదయం, సాయంత్రం రెండు డైపర్లు మాత్రమే వినియోగిస్తున్నాని చెప్పారు. తన భర్త కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడని ఇమాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకుదెరువు ఆగమైంది.. తన ఆరుగురు పిల్లలను ఎలా పోషించాలో అర్థం కావడం లేదని అమర్ ఆల్ మెస్రీ అన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో పెరుగుతున్న తన పిల్లలను చూస్తుంటే భయమేస్తోంది. వారిని ఎలా రక్షించుకోవాలో తెలియడం లేదన్నారు. ఆహారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. టియా అనే నా బిడ్డ కామెర్లతో బాధపడుతోంది. ఆమెకు తల్లి పాలు ఇవ్వాలి. కానీ తన భార్యకు పోషకాహారంతో కూడిన ఆహారం ఇవ్వలేకపోతున్నాను. తద్వారా పాలు కూడా సరిగా పడటం లేదు. కనీసం బయట కూడా పాలు దొరకని పరిస్థితి ఉందని అమర్ బోరున విలపించారు.