న్యూఢిల్లీ: పాకిస్థాన్ త్రివిధ రళాల అధిపతిగా(సీడీఎఫ్) ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌ని నియమించే ప్రక్రియకు అవరోధం ఏర్పడింది. సీడీఎఫ్‌గా మునీర్‌ని నియమిస్తూ నవంబర్ 29న నోటిఫికేషన్ జారీ కావలసి ఉండగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ దానిపై ఇప్పటివరకు సంతకం చేయలేదని తెలిసింది. సంతకం పెట్టడానికి ముందుగానే నవంబర్ 26న బహ్రెయిన్ పయనమైన షెహబాజ్ అక్కడి నుంచి 27న లండన్ బయల్దేరి వెళ్లారు.
అసిమ్ మునీర్ కొత్త నియామకం కోసం ఉత్తర్వుపై సంతకం చేయకుండా ఉద్దేశపూర్వకంగా షెహబాజ్ షరీఫ్ ఈ ప్రక్రియ నుంచి దూరంగా ఉంటున్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. సైన్యాన్ని బలోపేతం చేసేందుకు నవంబర్ 12న పాకిస్థానీ పార్లమెంట్ 27వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం త్రివిధ దళాలకు అధిపతిగా అసీమ్ మునీర్‌ని ప్రభుత్వం నియమించవలసి ఉంటుంది.