వాటికన్: క్యాథలిక్ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) ఇవాళ కన్నుమూశారు. సాధారణంగా పోప్ అంత్యక్రియలను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. అయితే చాలా క్లిష్టమైన ఆ పద్ధతిలో మార్పులు చేయాలని ఇటీవల దివంగత పోప్ ఫ్రాన్సిస్ సూచించారు. దీని కోసం ఆయన కొన్ని ప్లాన్స్‌ను కూడా అప్రూవ్ చేశారు. సరళతరమైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించే ప్రక్రియకు ఫ్రాన్సిస్ ఓకే చెప్పారు. గతంలో పోప్లను మూడు అంచెలున్న శవపేటికల్లో ఖననం చేసేవారు. సైప్రస్ చెట్టు, సీసం, సిందూర వృక్షంతో తయారైన శవపేటికను పోప్ పార్దీవదేహాన్ని తరలించేందుకు వినియోగించేవారు. అయితే అలాంటి శవపేటికలకు స్వస్తి పలికారు పోప్ ఫ్రాన్సిస్. చాలా సింపుల్‌గా ఉండే .. చెక్క శవపేటికలో తన పార్దీవదేహాన్ని ఉంచాలని ఇటీవల ఫ్రాన్సిస్ తెలిపారు. జింక్ ఖనిజ పట్టీతో ఆ శవపేటిక ఉండనున్నది.
వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ప్రజల సందర్శనార్థం ఎత్తుగా ఉండే కాటాఫల్క్ అనే ప్రదేశంలో సాధారణంగా పోప్ పార్దీవదేహాన్ని ఉంతారు. అయితే ఆ పద్ధతిని రద్దు చేశారు ఫ్రాన్సిస్. చివరి చూపు చూడాలనుకునే వారు.. పోప్ పార్దీవదేహాన్ని శవపేటికలోనే తిలకించే అవకాశం కల్పించారు. ఆ శవపేటిక పై కప్పును తీసి ఉంచనున్నారు. అయితే వాటికన్ కాకుండా మరో ప్రదేశంలో రోమన్ క్యాథలిక్ చర్చి మతపెద్దను ఖననం చేయడం గత శతాబ్ధ కాలంలో ఇదే తొలిసారికానున్నది. రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో పోప్ ఫ్రాన్సిస్‌ను ఖననం చేయనున్నారు.