మాస్కో: రష్యాలో దేశాధ్యక్ష ఎన్నికలు(Russian presidential election) జరుగుతున్నాయి. తూర్పు ప్రాంతంలో ఇప్పటికే పోలింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈసారి ముగ్గురు ప్రధాన ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు ఓపెన్ అయ్యాయి. మూడు రోజుల పాటు అంటే ఆదివారం వరకు రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
అధ్యక్ష హోదా కోసం నలుగురు పోటీపడుతున్నారు. ఆరేళ్ల పాటు ప్రభుత్వ పాలన ఉంటుంది. పుతిన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నేత లియోనిడ్ స్లట్స్కీ, కమ్యూనిస్టు నేత నికోలే కరిటొనోవ్, లిబరల్ సెంట్రిస్టు వాదిస్లావ్ దవనకోవ్ పోటీలో ఉన్నారు.
2020లో రాజ్యాంగ సంస్కరణ తర్వాత రష్యాలో జరుగుతున్న తొలి దేశాధ్యక్ష ఎన్నికలు ఇవే. ఆరేళ్ల పదవీ కాలంతో జరిగే ఈ ఎన్నికల్లో ఓ అభ్యర్థి రెండు సార్లు దేశాధ్యక్ష పదవిని చేపట్టవచ్చు అన్న మార్పులతో రాజ్యాంగాన్ని సంస్కరించారు. కొంత మంది ఓటర్లు ఆన్లైన్ ద్వారా తమ బ్యాలెట్లను వాడుకున్నారు.
రష్యా రీసర్చ్ సెంటర్ ప్రకారం ఈసారి ఎన్నికల్లో 70 శాతం పైనే ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రిమోట్ ప్రాంతాల్లో ఇప్పటికే ఎర్లీ ఓటింగ్ ముగిసింది. 20 లక్షల మంది ఇప్పటికే ఓట్లు వేశారని అధికారుల ద్వారా తెలుస్తోంది.