Nepal Plane Tragedy | నేపాల్లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ల్యాండవుతూ యెతి ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలిన ఘటనలో 72 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఆ దేశంలో గత మూడు దశాబ్దాల్లో అత్యంత విపత్తుగా పరిణమిస్తున్నారు. అయితే, రెండు వారాల క్రితమే కొత్తగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పుష్ప కమల్ దహల్ ప్రచండ.. ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
చైనా తన ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ `బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)`లో భాగంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది. ఈ విమానాశ్రయ నిర్మాణం కోసం చైనాతో నేపాల్ ప్రభుత్వం 215.96 మిలియన్ డాలర్ల సాఫ్ట్ లోన్ ఒప్పందం చేసుకున్నది. గతేడాది చైనా మాజీ విదేశాంగ మంత్రి యాంగ్యీ.. ఈ విమానాశ్రయాన్ని నేపాల్ ప్రభుత్వానికి అప్పగించారు.
కానీ, ఈ విమానాశ్రయ నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు లోపించాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడం, ఎయిర్పోర్ట్ నిర్వహణలో వైఫల్యం కనిపిస్తున్నదని చెబుతున్నారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు నేపాల్ వద్ద మౌలిక వసతులు లేవని విమర్శలు ఉన్నాయి.
ఈ విమానాశ్రయ పరిధిలో ప్రత్యేకించి.. పర్వత శ్రేణులతో కూడుకున్న మారుమూల ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసే వసతులు లేవన్న మాటలు వినిపిస్తున్నాయి. పర్వత శ్రేణుల్లో తరుచుగా వాతావరణం మారిపోతూ ఉంటుందని, విమాన ప్రయాణానికి అననుకూల పరిస్థితులు నెలకొంటాయని ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్లు చెబుతున్నారు.