PM Modi in China : పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. చైనా అధ్యక్షుడు (China president) జీ జిన్‌పింగ్ (Xi Jinping) తో చర్చల సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల ప్రజల సంక్షేమం ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారంతో ముడిపడి ఉందని అన్నారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా వీరి మధ్య భేటీ జరిగింది. ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు 2025 కోసం చైనాలోని తియాంజిన్ నగరానికి చేరుకున్న ప్రధాని.. అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోపాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. చివరిసారిగా ఈ నేతలు రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలుసుకున్నారు.
2020లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు మసకబారాయి. ఆ సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలును సాకుగా చూపి ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇరుదేశాలు ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ సమావేశం కీలకంగా మారింది. మోదీ, జిన్‌పింగ్ మధ్య జరిగిన చర్చల్లో ఇరుదేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవడమనేది ప్రధాన ఎజెండాగా ఉంది.