బీజింగ్: ప్రధాని మోదీ చైనాలో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ పర్యటన సమయంలో చైనా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వినియోగించే అత్యంత విలాసవంతమైన కారులో మోదీ చక్కర్లు కొట్టారు. హాంగ్కీ( Hongqi) ఎల్5 లిమినోసిన్ కారులో మోదీ ప్రయాణించారు. షాంఘై సహకార సంస్థ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన ఈ కారును వినియోగించారు. మోదీ పర్యటించిన హాంగ్కీ ఎల్5 మోడల్ కారునే.. చైనా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా వాడుతున్నారు. చైనీస్ టాప్ నేతలతో పాటు ప్రముఖ విదేశీ నేతలకు మాత్రమే ఈ కారును వినియోగిస్తుంటారు. 2019లో ఇండియాలోని మహాబలిపురంకు జీ జిన్‌పింగ్ వచ్చిన సమయంలో ఎల్5 కారులోనే ఆయన తిరిగారు.
హాంగ్కీని హాంగ్-చీ అని పలుకుతారు. మాండరిన్ భాషలో దీని అర్థం ఎరుపు జెండా అని. ఫస్ట్ ఆటోమోబైల్ వర్క్స్(ఎఫ్ఏడబ్ల్యూ) గ్రూపు దీన్ని తయారు చేస్తోంది. ఇది పూర్తిగా మేడిన్ చైనా వాహనం. 1958లో ఈ కారును తొలిసారి లాంచ్ చేశారు. చైనాలో అతిపురాతన ప్యాసింజెర్ కారుగా దీన్ని భావిస్తారు. చైనాలోని సంపన్న వర్గాలు ఈ కారును వినియోగిస్తుంటారు. డిజైన్, నిర్మాణం, ప్రమోషన్ మొత్తం చైనాలోనే సాగుతుంది. నిజాకిని తొలుత కేవలం కమ్యూనిస్టు పార్టీ నేతల కోసం మాత్రమే ఈ కారును ఉత్పత్తి చేశారు. హాంగ్కీ కార్ల ఉత్పత్తి 1981లో నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ 1990 మధ్య కాలంలో ఉత్పత్తి ప్రారంభించారు. హాంగ్కీ వర్షన్‌కు చెందిన ఎల్5 మోడల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది.
హాంగ్కీ ఎల్5 కారులో 6.0 లీటర్ల వీ12 ఇంజిన్ ఉంది. సుమారు 400 హార్స్పవర్ల శక్తి ఉత్పత్తి చేస్తుంది. కేవలం 8.5 సెకన్లలో అది వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిలోమీటర్లు. ఈ కారు 5.5 మీటర్ల పొడుగు, మూడు టన్నుల బరువు ఉంటుంది. కారులోపల చాలా స్పేసియస్ సీటింగ్ ఉంటుంది. లెదర్ సీట్లు ఉంటాయి. రియర్ సీట్ల వద్ద మసాజ్, హీటింగ్, వెంటిలేషన్ సౌకర్యాలు ఉంటాయి. ఆల్ వీల్ డ్రైవ్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరాలు ఉన్నాయి.
హాంగ్కీ ఎల్ 5 కారు ఖరీదు సుమారు 5 మిలియన్ల యువాన్లు. అంటే భారత కరెన్సీలో సుమారు ఏడు కోట్లు. చైనాలో ఉత్పత్తి అవుతున్న అత్యంత ఖరీదైన కారు ఇదే. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తరుచుగా జరిగే పబ్లిక్ కార్యక్రమాలకు హాంగ్కీ ఎల్ 5 కారులోనే వెళ్తుంటారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ద బీస్ట్ కారుకు సమానంగా ఉన్న హాంగ్కీ ఎన్701 మోడల్ కారులో కూడా జీ జిన్‌పింగ్ ప్రయాణిస్తారు.
కమ్యూనిస్టు దిగ్గజ నేత మావో జిదాంగ్ హాంగ్కీ వర్షన్ కారును వాడినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ 1972లో చైనాలో పర్యటించిన సమయంలో ఆయన ఈ కారు ఎక్కినట్లు తెలుస్తోంది.