PM Modi : నేపాల్‌లో ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. బుధవారం తలెత్తిన ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 22 మంది మరణించగా, వందల మంది గల్లంతయ్యారు. వీరిలో 105 మంది వరకు భారతీయులున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం నేపాల్ ప్రధాని బాలెన్ షాతో మాట్లాడారు. ఈ మేరకు ఫోన్లో సంప్రదించారు. నేపాల్‌లో సంభవించిన ఈ విషాద ఘటనపై ఆ దేశ ప్రధానికి, ప్రజలకు మోదీ సంతాపం తెలిపారు.
మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఇదే సమయంలో నేపాల్‌కు అవసరమైన మానవతా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశంపై ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. నేపాల్ అధికారులతో భారతీయ బృందాలు సమన్వయం చేస్తున్నాయని ప్రధాని వెల్లడించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాల ద్వారా తగిన సాయం అందించేందుకు భారత్ ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర చికిత్సకు అవసరమయ్యే మందులు, రేషన్, ఇతర సరుకులు అందించాలని నిర్ణయించింది.
Spoke to Prime Minister Balendra Shah and conveyed condolences on the loss of lives due to the floods in Nepal. The people of India stand in solidarity with their sisters and brothers in Nepal at this difficult time.
India is ready to provide all possible humanitarian…
— Narendra Modi (@narendramodi) August 26, 2026
ఇదే సమయంలో అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్న నేపాల్ అధికారులతో మన దేశానికి చెందిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనబోతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ టీంలు సేవలు అందిస్తాయి. నేపాల్‌లో గల్లంతైన, చిక్కుకుపోయిన భారతీయులకు, వారి కుటుంబాలకు సాయం అందించేందుకు నేపాల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రత్యేక ఎమర్జెన్సీ నెంబర్లను కేటాయించింది.
+977 985 131 6807, +977 970 910 7500 నెంబర్లను వాట్సాప్ ద్వారా సంప్రదించాలని సూచించింది. బుధవారం నాటి ఘటనలో వందల మంది గల్లంతయ్యారు. ఇందులో 291 మంది విదేశీయులుండగా, 105 మంది భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.