Music | సిడ్నీ, అక్టోబర్ 3: సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంటుందని అంటారు. రాళ్లు కరుగుతాయో లేదో కానీ మొక్కలు మాత్రం వేగంగా పెరుగుతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఒకే విధమైన సంగీతాన్ని వినిపించడం ద్వారా మొక్కల పెరుగుదలకు కారణమయ్యే ఫంగస్ పనితీరును ప్రోత్సహించవచ్చని తేలింది. ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం వివరాలు ‘బయాలజీ’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ట్రైకోడెర్మ హర్జియానమ్ అనే రకమైన ఫంగస్‌ను సేంద్రీయ వ్యవసాయంలో వినియోగిస్తారు. ఇది మొక్కలను వ్యాధుల నుంచి రక్షణ కల్పించడంతో పాటు మట్టిలో పోషకాలు పెంచి మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అధ్యయనంలో భాగంగా ప్రతిరోజు అరగంట పాటు 80 డిసెబిల్స్లో ఒకేరకమైన సంగీతాన్ని వినిపించారు. ఐదురోజుల తర్వాత చూడగా నిశబ్దంలో ఉన్న ఫంగస్ కంటే సంగీతం వినిపించిన చోట ఉన్న ఫంగస్ ఎక్కువగా వృద్ధి చెందిందని పరిశోధకులు గుర్తించారు. తద్వారా మొక్కల ఎదుగుదలకు సంగీతం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.