Philippine rain : ఫిలిప్పీన్స్లో ట్రామీ తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిపడ్డాయి. నీట మునిగిన పలు ప్రాంతాలకు ప్రధాన భూభాగంతో సంబంధాలు తెగిపోయాయి. టెలిఫోన్ లైన్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారంలో మగ్గుతున్నాయి.
ఈ పరిస్థితి సహాయక చర్యలకు కూడా ఆటంకంగా మారింది. ట్రామీ ప్రభావంతో వరదల్లో కొట్టుకుపోయి కొందరు, కొండచరియలు విరిగిపడి మరికొందరు, విద్యుత్ షాక్ తదితర ప్రమాదాలతో ఇంకొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ట్రామీ కారణంగా మరణించిన వారి సంఖ్య 130కి చేరుకుంది. పలువురు గల్లంతయ్యారు. లక్షల మంది ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు.
ఈ ప్రకృతి విపత్తు తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. పలు ప్రాంతాల్లో దాదాపు 10 అడుగుల బురదమట్టి పేరుకుపోయింది. బండరాళ్లు, శిథిలాలు గుట్టల్లా పోగయ్యాయి. ఆ బురద, శిథిలాలను తొలగిస్తూ తప్పిపోయినవారి కోసం వెతుకుతున్నారు. దాంతో శవాలు బయటపడుతున్న దృశ్యాలు హృదయవిధారకంగా ఉన్నాయి.