మనీలా: కొత్త సంవత్సరం తొలిరోజే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని నినోయ్ అక్వినో ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో (NAIA) ప్రయాణికులకు చేధు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో చాలాసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులు బ్యాకప్ పవర్ అందించే ప్రయత్నం చేశారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో బ్యాకప్ పవర్ సప్లయ్ కాలేదు. దాంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌పై తీవ్ర ప్రభావం పడింది.
సౌత్ఈస్ట్ ఏసియన్ హబ్‌లోని దాదాపు 300 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో వేల మంది ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. క్రిస్మస్ పండుగ, కొత్త సంవత్సరం నేపథ్యంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి విదేశీ పర్యాటకులు భారీ సంఖ్యలో ఫిలిప్పీన్స్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎయిర్‌పోర్టు నిండా జనం కిక్కిరిసిపోయారు. పలు చెక్ ఇన్ కౌంటర్ల దగ్గర ప్రయాణికులు బారులు తీరారు. చాలామంది తమ లగేజీ అటూఇటూ తీసుకెళ్తూ, ఫ్లైట్ అరైవల్ స్క్రీన్ల దగ్గర ఆప్డేట్స్ కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి కొన్ని గంటలపాటు కొనసాగిన ఈ అంతరాయం వల్ల 56 వేల మంది ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.
కాగా, సమస్య పరిష్కారం అయిన అనంతరం ఫిలిప్పీన్స్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రెటరీ జైమీ బౌటిస్టా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అంతరాయానికి చింతిస్తున్నామని చెప్పారు. ఇబ్బందులుపడ్డ ప్రయాణికులను క్షమాపణలు కోరారు.