Dengue | మనీలా, ఫిబ్రవరి 19: డెంగ్యూపై పోరాటంలో భాగంగా అడిషన్ హిల్స్ అనే ఓ ఫిలిప్పీన్స్ పట్టణం దోమలపై దండయాత్ర మొదలుపెట్టింది. ఇందులో ప్రజలను భాగస్వాములను చేసేందుకు వింత ప్రకటన చేసింది. దోమలను పట్టుకుంటే నజరానా ఇస్తామని ప్రకటించింది. దోమలను ప్రాణంతో పట్టుకున్నా లేదా చంపినా డబ్బులు ఇస్తామని చెప్పింది.
ఈ పట్టణానికి సమీపంలోని క్వేజాన్ నగరంలో దోమల కారణంగా డెంగ్యూ కేసులు పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంది. ఐదు దోమలు లేదా లార్వాకు రూపాయిన్నర (ఫిలిప్పీన్స్ కరెన్సీలో ఒక పెసో) చొప్పున నజరానా ఇస్తామని పట్టణ నాయకుడు కార్లిటో కెర్నల్ ప్రకటించారు. ఈ ప్రకటనతో పౌరులు అప్రమత్తమయ్యారు. దోమలను ప్రాణాలతో పట్టుకోవడం సాధ్యం కాదు కానీ, వాటిని చంపేద్దాం అంటూ దోమల బ్యాట్లతో యుద్ధానికి సిద్ధమయ్యారు.