ఇస్లామాబాద్: ఊరకనే సొమ్ములు వస్తున్నాయంటే చాలు.. మనుషులు ఎగబడిపోతారన్న విమర్శలకు తాము అతీతులం కాదని నిరూపించుకున్నారు పాకిస్థాన్ ప్రజాప్రతినిధులు.. తమది కాని సొమ్ము కూడా తమదే అని బహిరంగంగా క్లెయిమ్ చేసుకుని తమ కక్కుర్తి బుద్దిని చూపి పార్లమెంట్ సాక్షిగా నవ్వుల పాలయ్యారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సోమవారం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సమావేశాలు జరుగుతుండగా, స్పీకర్ అయాజ్ సాదిక్ హఠాత్తుగా పది 5,000 పాకిస్థాన్ కరెన్సీ రూపీ (పీకేఆర్) నోట్లను (సుమారు రూ.16,500) చేతిలో పట్టుకుని పైకెత్తి చూపిస్తూ ఇవి పార్లమెంట్ ప్రాంగణంలో దొరికాయి. ఈ డబ్బు ఎవరిదో చేతులెత్తండి అని కోరగా, విచిత్రంగా 12-13 మంది ఎంపీలు చేతులెత్తడంతో ఆయన షాక్ తిన్నారు.