Pak Terrorism : ప్రపంచ దేశాల్లో ఉగ్రవాద దాడులు (Terror Attacks), ఉగ్రవాద దాడుల కారణంగా సంభవిస్తున్న మరణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. పాకిస్థాన్ (Pakistan) లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ‘గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 (Global Terrorism Index-2026)’ లో పాకిస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన ఏడాది అక్కడ ఉగ్రవాద సంబంధ ఘటనల్లో ఏకంగా 1,139 మంది ప్రాణాలు కోల్పోయినట్లు శనివారం విడుదలైన ఒక నివేదిక స్పష్టంచేసింది. మొరాకోకు చెందిన జర్నలిస్ట్, పరిశోధకురాలు ఫాతిమా ఎల్ హషిమి (Fathima El Hashmi) ‘అమెరికన్ థింకర్’ అనే ఆన్లైన్ మ్యాగజైన్లో ఈ విషయంపై విశ్లేషించారు.
పాకిస్థాన్లో హింస ఒక సాధారణ విషయంగా మారిపోయిందని, ఇది దేశ భద్రతావ్యవస్థ తీవ్రంగా క్షీణిస్తోందనడానికి నిదర్శనమని ఫాతిమా పేర్కొన్నారు. పాకిస్థాన్లో ఉగ్రవాదం పెరగడం ఇది వరుసగా ఆరో ఏడాది అని ఆమె గుర్తుచేశారు. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా మరణాల సంఖ్య పెరిగిందని తెలిపారు. 2025లో జరిగిన ఉగ్రదాడుల్లో 74 శాతానికిపైగా, మరణాల్లో 67 శాతం ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలోనే నమోదయ్యాయని ఫాతిమా వివరించారు.
ఈ ప్రాంతాల్లో పాలన, అభివృద్ధి లేకపోవడంవల్లే అంతర్గత సంఘర్షణలకు కేంద్రంగా మారాయని ఆమె అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాద నిరోధక వ్యూహం కేవలం సైనిక చర్యలకే పరిమితమైందని, పాలనాపరమైన సంస్కరణలు, తీవ్రవాదాన్ని నిరోధించే ఇతర చర్యలు బలహీనంగా ఉన్నాయని ఫాతిమా విమర్శించారు. కేవలం సైనిక బలంతో కాకుండా రాజకీయ స్పష్టత, సమర్థవంతమైన పాలన, పొరుగు దేశాలతో సత్సంబంధాలు వంటి చర్యలు చేపడితేనే పాకిస్థాన్లో శాంతి నెలకొంటుందని ఆమె స్పష్టంచేశారు.