ఇస్లామాబాద్, మే 5 : తమ సైనిక విన్యాసం ఎక్సర్సైజ్ ఇండస్లో భాగంగా పాకిస్థాన్ సోమవారం మరో క్షిపణి ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్టు ఆ దేశ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) ఒక ప్రకటనలో తెలిపింది. కార్యాచరణ సంసిద్ధతను, క్షిపణి అధునాతన నావిగేషన్ వ్యవస్థ, మెరుగైన కచ్చితత్వంతో పాటు సహా పలు కీలక సాంకేతిక సామర్ధ్యాలను ధ్రువీకరించడానికి 120 కి.మీ రేంజ్ గల ఈ క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. మరోవైపు 11వ రోజు కూడా పాక్ సరిహద్దులో కవ్వింపు కాల్పులకు పాల్పడింది. అయితే భారత సైన్యం కాల్పులను సమర్థంగా ఎదుర్కొంది. ఇంకోవైపు భారత్తో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ ప్రభుత్వం అఖిల పక్ష భేటీ నిర్వహించింది. దీనికి ప్రధాన విపక్షమైన ఇమ్రాన్ ఖాన్ పార్టీ గైర్హాజరైంది.