న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్నది. రెండు దేశాల ప్రతినిధిలు గత వారం ఇస్లామాబాద్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే మొదటిసారి జరిగిన చర్చల్లో శాంతి ఒప్పందం కుదరలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ చర్చలు అసమగ్రంగా ముగిశాయి. ఇక సీజ్ఫైర్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అమెరికా, ఇరాన్ చర్చల ప్రక్రియపై సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండోసారి చర్చలను నిర్వహించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని పాకిస్థాన్ తెలిపింది. పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాషింగ్టన్, టెహ్రాన్ మద్య జరిగే చర్చలను ఈసారి జెనీవాలో నిర్వహించాలన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏప్రిల్ 21వ తేదీన కాల్పుల విరమణ గడువు ముగుస్తుంది. ఈ లోగా చర్చలు నిర్వహించాలన్న ఆలోచనలో అమెరికా ప్రతినిధులు ఉన్నట్లు తెలిసింది. రెండో రౌండ్ ముఖాముఖి చర్చల్లో ఆ బృందాలే పాల్గొంటాయా లేదా అన్న అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.
అమెరికా, ఇరాన్ మధ్య చర్చల పునరుద్దరణ జరగాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించాలన్నారు. కొన్ని వారాల పాటు సాగిన విధ్వంసం, విషాదం తర్వాత.. పశ్చిమాసియాలో ప్రస్తుత సంక్షోభానికి మిలిటరీ పరిష్కారం కాదని తెలిసిందన్నారు. చర్చల పునరుద్దరణ జరిగి, ఓ ఒప్పందం కుదరాలన్నారు. అన్ని ఉల్లంఘనలు స్తంభించాలన్నారు. సంక్షోభానికి కారణమైన దేశాలన్నీ.. హోర్ముజ్ జలసంధిలో నౌకల స్వేచ్ఛ ప్రయాణానికి గౌరవం ఇవ్వాలన్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ ప్రక్రియ జరగాలన్నారు.