Pakistan : పాకిస్థాన్ (Pakistan) ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభం (Financial crisis) లో చిక్కుకున్నది. ప్రస్తుతం రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఇలాంటి గడ్డు కాలంలో అమెరికా, ఇరాన్ (US, Iran) మధ్య రేగిన యుద్ధ వాతావరణం ఆ దేశ ఆర్థికవ్యవస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది. పశ్చిమాసియా (West Asia) లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లపైకి చేరాయి. చమురు దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడే పాకిస్థాన్‌పై ఈ అంతర్జాతీయ సంక్షోభం నేరుగా ప్రభావం చూపింది.
అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకోలేక మే మొదటి వారంలో అక్కడి ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ.14.92 మేర పెంచింది. దాంతో పాకిస్థాన్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ ధర గరిష్ఠంగా రూ.414.78 కి చేరి దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల ఆధారంగా పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంధన ధరలను సమీక్షిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా నిన్నటి నుంచి అమల్లోకి వచ్చేలా పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ.5 మేర స్వల్పంగా తగ్గించారు.
ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.409.78 (సుమారు రూ.410) పలుకుతుండగా.. హై-స్పీడ్ డీజిల్ ధర కూడా లీటర్‌కు రూ.409.58 వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వ సమీక్షలో ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ.. సామాన్య ప్రజల కోణం నుంచి చూస్తే లీటర్‌కు రూ.410 అనేది ఇంకా మోయలేని భారంగానే మిగిలిపోయింది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పాకిస్థాన్‌లో అంతర్గతంగా రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.
దాంతో నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, మందుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి దైనందిన జీవితాన్ని మరింత నరకప్రాయంగా మార్చాయి. పెట్రోల్ కొనడం తమ ఆర్థిక పరిధిని దాటిపోవడంతో అక్కడి ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయాలవైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రావల్పిండి వంటి ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లకు డిమాండ్ భారీగా పెరిగినట్లు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.