ఇస్లామాబాద్, ఏప్రిల్ 8: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర వేస్తూ పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించిన బిల్లును ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ శనివారం తిప్పిపంపారు. ప్రతిపాదిత బిల్లు చట్టసభ అధికార పరిమితికి మించినదని తెలిపారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కొట్టివేస్తూ మే 14న పంజాబ్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు ఈ నెల 4న తీర్పు ఇచ్చినప్పటి నుంచి కోర్టుకు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు పొడచూపాయి. కోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వం విమర్శించడమే కాకుండా తిరస్కరించింది. పాక్ సీజే సుమోటో అధికారాలను తగ్గించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంట్ ఇటీవల ఆమోదించింది.