ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారీ షాక్ తగిలింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే ఇమ్రాన్ మిత్రపక్షమైన ఎంక్యూఎం పార్టీ గుడ్‌బై చెప్పింది. ముత్తైదా ఖౌమి మూమెంట్ పాకిస్థాన్ పార్టీ.. ప్రతిపక్షానికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నది. జర్దారీ దీనికి సంబందించిన ట్వీట్ కూడా చేశారు. ఇమ్రాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఏప్రిల్ 3వ తేదీన ఓటింగ్ జరగనున్నది. ఎంక్యూఎం పార్టీ .. పీపీపీతో జతకట్టడంతో రాత్రికి రాత్రి ఇమ్రాన్ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ప్రతిపక్ష సభ్యుల బలం ఇప్పుడు 177కు చేరుకున్నది. ఇక ఇమ్రాన్‌కు చెందిన కూటమిలో 164 మంది సభ్యులే ఉన్నారు. ఒకవేళ 172 మంది ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే అప్పుడు ఆయన తన పదవిని కోల్పోవాల్సి వస్తుంది.