ఇస్లామాబాద్, ఏప్రిల్ 3: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందుగా చెప్పినట్టే ప్రతిపక్షాలపైకి ఇన్‌స్వింగర్ యార్కర్లు విసిరారు. అవిశ్వాస పరీక్షలో ఓడిపోయి ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితుల్లో అనూహ్య నిర్ణయం తీసుకొన్నారు. జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)ని రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి సిఫారసు చేశారు. నిమిషాల వ్యవధిలోనే అధ్యక్షుడు దాన్ని ఆమోదించారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాకిస్థాన్‌లో మళ్లీ సాధారణ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 90 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని పాక్ ప్రసార శాఖ మంత్రి ఫరూక్ హబీబ్ ప్రకటించారు. అప్పటివరకు ఇమ్రాన్ ఖానే ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. ఇంతవరకు పాకిస్థాన్‌లో ఏ ఒక్క ప్రధాని కూడా ఐదేండ్ల కాలపరిమితి పూర్తి చేసుకోలేదు. 2018 సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడంతో ఇమ్రాన్ ప్రధాని గద్దెనెక్కారు. ధరల నియంత్రణలో సర్కారు విఫలమైందంటూ విపక్షాలు ఇటీవల ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
షాకిచ్చిన డిప్యూటీ స్పీకర్
అధ్యక్షుడు పార్లమెంటు రద్దు ప్రకటన చేయకముందు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు స్పీకర్ అసద్ ఖైజర్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాసాన్ని ప్రకటించాయి. ఇందుకు సంబంధించిన తీర్మానంపై 100 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు. నిబంధనల ప్రకారం.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే సభకు ఆయన అధ్యక్షత వహించకూడదు. దీంతో, ఆదివారం డిప్యూటీ స్పీకర్ కాసీం సూరీ అధ్యక్షతన పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశమైంది. ప్రధాని అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుందని, ఇమ్రాన్ ఓడిపోతారని భావించిన ప్రతిపక్షాలకు కాసీం సూరీ షాక్ ఇచ్చారు. తీర్మానంపై ఓటింగ్‌కు తిరస్కరించారు. ‘ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానం పాకిస్థాన్ రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ఉంది. అందుకే ఓటింగ్‌కు తిరస్కరిస్తున్నా’ అని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌కు అవిశ్వాస గండం తప్పింది.
నిమిషాల వ్యవధిలోనే
అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించి సభను వాయిదా వేసిన వెంటనే ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. పాక్ ప్రభుత్వాన్ని కూల్చడానికి విదేశీయులు చేసిన కుట్ర విఫలమైందన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం అనేది విదేశీ ఎజెండాలో భాగమని పేర్కొన్నారు. పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షుడికి సిఫారసు చేసినట్టు చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇమ్రాన్ చెప్పిన కొద్దిసేపటికే అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇమ్రాన్ మోసకారి
అవిశ్వాస తీర్మానం తిరస్కరణ, పార్లమెంటు రద్దు రాజ్యాంగ విరుద్ధమని పాక్ ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపాయి. ‘ఓటమి తప్పదని తెలిసి ఇమ్రాన్ దొడ్డిదారిన పారిపోయారు’ అని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావర్ బుట్టో జర్దారీ అన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ మోసకారి. రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు పూనుకొన్నారు’ అని పీఎంఎల్-ఎన్ నేత మరియం ఔరంగజేబు అన్నారు. పాకిస్థాన్ పార్లమెంటులో ఆదివారం నాటి పరిణామాలను ఆ దేశ సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొన్నది. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో పాక్ సుప్రీంకోర్టు ఆదివారం తెరిచే ఉంది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై తమకేం సంబంధంలేదని, జోక్యం చేసుకోబోమని ఆ దేశ ఆర్మీ ప్రకటించింది. ఇమ్రాన్‌ను ప్రధానిగా తొలగిస్తున్నట్టు క్యాబినెట్ సెక్రటేరియట్ ఆదివారం రాత్రి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది