ఇస్లామాబాద్, జనవరి 23: ఇప్పటికే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొన్న పాకిస్థాన్‌లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. సోమవారం నేషనల్ గ్రిడ్‌లో భారీ వైఫల్యం చోటుచేసుకోవడంతో ఆ దేశంలో అంధకారం అలుముకొన్నది. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోయారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌తోపాటు ఆర్థిక రాజధాని కరాచీ, పెషావర్ వంటి అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రజలు కరెంట్ కోతలను చవిచూశారు.
ఇంధన మంత్రిత్వశాఖ ప్రకారం.. ఉదయం 7.34 గంటల సమయంలో నేషనల్ గ్రిడ్‌లో వైఫల్యం ఎదురైంది. కాగా, ఇదేమీ పెద్ద సంక్షోభం కాదని, పునరుద్ధరణ చర్యలను వెంటనే ప్రారంభించామని విద్యుత్తు శాఖ మంత్రి ఖుర్రమ్ దస్త్‌గిర్ పేర్కొన్నారు. 12 గంటల్లో విద్యుత్తును పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ట్వీట్ చేశారు. అయితే కరెంట్ కోతల కారణంగా చాలా నగరాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మెట్రో రైళ్లు నిలిచాయి. పెషావర్‌లో నీటి కోసం జనం అవస్థలు పడ్డారు.
బెడిసికొట్టిన విద్యుత్తు ఆదా ప్రయత్నం
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్ విద్యుత్తు వినియోగాన్ని తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. ఈ ప్రయత్నాలే ఇప్పుడు గ్రిడ్ వైఫల్యానికి కారణం. విద్యుత్తును ఆదా చేయడానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల రాత్రి వేళ డిమాండ్ తగ్గడంతో రాత్రిపూట విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థను నిలిపివేశారు. ఉదయం మళ్లీ ప్రారంభించగానే వోల్టేజీలో హెచ్చుతగ్గులు ఏర్పడి ఒకదాని తర్వాత ఒకటి విద్యుత్తు ఉత్పత్తి యూనిట్లు నిలిచిపోయాయి.
విద్యుత్తు వ్యవస్థ వైఫల్యంపై విచారణ జరిపేందుకు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. పాక్‌లో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది అక్టోబర్‌లోనూ సాంకేతిక కారణాలతో దేశంలో 12 గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం పాక్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. విద్యుత్తు ఆదా కోసం రాత్రి 8.30 గంటలకే దుకాణాలు మూసేస్తున్నది.