క్వెట్టా : బలూచిస్థాన్ ప్రావిన్సులో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి 400 మందికిపైగా ప్రయాణికులను బంధించిన బలూచ్ తీవ్రవాదులందరినీ హతమార్చినట్టు పాకిస్థానీ సైన్యం చేసిన ప్రకటనను బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) గురువారం ఖండించింది. తమ సభ్యులకు, పాకిస్థాన్ భద్రతా సిబ్బందికి మధ్య భీకర పోరు కొనసాగుతోందని, పాకిస్థానీ దళాలు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయని బీఎల్ఏ వెల్లడించింది. పాకిస్థానీ సైన్యం యుద్ధ రంగంలో గెలిచింది కాని బందీలను విడుదల చేసింది కాని లేదని బీఎల్ఏ తెలిపింది.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన తీవ్రవాదులందిరినీ హతమార్చి బందీలను విడుదల చేసినట్టు పాకిస్థానీ సైన్యం బుధవారం ప్రకటించింది. 33 మంది తీవ్రవాదులను కాల్చివేశామని, 21 మంది ప్రయాణికులు, నలుగురు పాకిస్థానీ సైనిక సిబ్బంది కూడా మరణించారని పాక్ ప్రకటించింది. కాగా, తప్పుడు ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పాకిస్థానీ సైన్యం ప్రయత్నిస్తోందని బీఎల్ఏ తాజా ప్రకటనలో ఆరోపించింది. ఖైదీల మార్పిడికి తాము ప్రతిపాదించగా పాకిస్థాన్ చర్చలకు నిరాకరించి తన సైనికులను గాలికి వదిలేసిందని గ్రూపు ఆరోపించింది. యుద్ధ క్షేత్రంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు స్వతంత్ర జర్నలిస్టులను పంపాలని పాక్ ప్రభుత్వానికి బీఎల్ఏ ప్రతిపాదించింది.
మా ప్రమేయం లేదు: తాలిబాన్ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాకింగ్‌లో అఫ్గాన్‌కు చెందిన తీవ్రవాదుల ప్రమేయం ఉందంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణను గురువారం తాలిబాన్ ఖండించింది.