Pak | ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామమని యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం, నాయకులు మాత్రం అంగీకరించరు. ఉగ్రవాదులను యోధులుగా, స్వాతంత్య్ర పోరాట యోధులుగా చెప్పుకుంటుంది. అయితే, అప్పుడప్పుడు పాకిస్తాన్ నైజం బయటపడుతున్నది. తాజాగా మరోసారి పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయింది. ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన ఉగ్రవాదులకు అంత్యక్రియల్లో పాల్గొన్న లష్కర్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ ఉగ్రవాది కాదని.. ఆయన సామాన్యుడని హీనా రబ్బానీ ఖర్ అల్ జజీరాతో ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
జర్నలిస్ట్ లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియల్లో ప్రార్థనలు చేస్తున్న దృశ్యాలు, ఆయన వెనుక పాక్ సైన్యం, పోలీస్ ఉన్నతాధికారులు ఉన్న చిత్రాలను ఆమెకు చూపించారు. సదరు వ్యక్తి అమెరికా ప్రకటించిన ఉగ్రవాది అంటూ జర్నలిస్ట్ పేర్కొన్నారు. దీనికి హీనా రబ్బాని స్పందిస్తూ.. అంతర్జాతీయ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ కాదని.. పాక్‌కు చెందిన సామాన్య వ్యక్తి అని తెలిపారు. పాకిస్తాన్లో లక్షలాది మంది అబ్దుల్ రవూఫ్‌లు ఉన్నారని.. తాను పూర్తి అధికారంతో ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు. పాక్ సైన్యం స్వయంగా విలేకరుల సమావేశం నిర్వహించిందని.. ఆ వ్యక్తి ఉగ్రవాది కాదంటూ సైన్యం ఖండించలేదని జర్నలిస్ట్ గుర్తు చేశారు.
పాక్ సైన్యం చిత్రంలో కనిపించిన వ్యక్తి నేషనల్ ఐడీని సైతం చూపించారు. అమెరికా ప్రకటించిన ఉగ్రవాది ఐడీతో సరిపోయిందని చెప్పగా.. హీనా రబ్బాని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమెకు చెప్పాలో తెలియక పాత విషయాలనే చెప్పుకురావడం గమనార్హం. ఆధారాలతో సహా ఉగ్రవాది గురించి బయటపెట్టడంతో షాక్‌కు గురయ్యారు. అమెరికా ప్రకటించిన ఉగ్రవాది ఫొటోలో కనిపించిన వ్యక్తి కాదంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు మద్దతు ప్రకటిస్తుందనే విషయం మరోసారి తేలిపోయింది.