ఇస్లామాబాద్: సైన్యం, పౌర నాయకత్వం కలసి ఏకాభిప్రాయంతో దేశాన్ని పాలిస్తున్న హైబ్రిడ్ మోడల్ పాలనగా తమ ప్రభుత్వాన్ని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అభివర్ణించారు. బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్టు మెహదీ హసన్‌కు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పాకిస్థాన్ పాలనలో సైన్యం జోక్యం అధికంగా ఉందన్న వాదనను తోసిపుచ్చారు.
గతంలో పాక్‌లో అనేక సైనిక తిరుగుబాట్లు, సైనిక పాలన, సైన్యాధ్యక్షులు అధ్యక్షులు కావడం వంటి అనేక పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో పాలనలో సైనిక పెత్తనం ఎక్కువగా ఉందన్న ఆరోపణలను రక్షణ మంత్రి వద్ద ప్రస్తావించగా అటువంటిదేమీ లేదని అన్నారు.
తమ దేశంలో అమెరికా తరహా ప్రజాస్వామ్యం నడుస్తోందని ఆయన వెల్లడించారు. పాక్‌లో సైన్యానికే ఎక్కువ అధికారాలు ఉన్నాయని, మీ కన్నా సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ శక్తిమంతుడని చెప్పుకుంటున్నారన్న ప్రశ్నకు ఆసిఫ్ జవాబిస్తూ అలాంటిదేమీ లేదని, తనది రాజకీయ ఎంపికని, తాను రాజకీయ కార్యకర్తనని చెప్పారు.
అమెరికాలో సెక్రటరీ ఆఫ్ వార్(రక్షణ మంత్రితో సమానం)కి సైనిక జనరల్స్‌ని తొలగించే అధికారం ఉంటుందని, ఆ పరిస్థితి పాక్‌లో లేదని హసన్ ప్రశ్నించగా పాక్ సైనిక పాలకులు ఎక్కువగా బయటకు కనిపించడం వల్ల మీకు అలా అనిపిస్తుందని ఆయన చెప్పారు. అమెరికా విధానం వేరేగా ఉంటుందని ఆయన తెలిపారు. సైన్యం, ప్రభుత్వం సమానంగా అధికారాన్ని పంచుకుంటాయా అన్న ప్రశ్నకు కాదని ఆయన జవాబిచ్చారు.