ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ ఐఎంఎఫ్ షరతులకు అనుగుణంగా ఖర్చులు తగ్గించేందుకు పలు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది. ఆరు మంత్రిత్వ శాఖలను మూసివేస్తున్నామని, మరో రెండింటిని విలీనం చేస్తున్నామని ప్రకటించింది. 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను రద్దు చేస్తున్నామని ఆదివారం వెల్లడించింది.
ఐఎంఎఫ్‌తో సమావేశమైన ఆర్థిక శాఖ మంత్రి ఔరంగజేబు మీడియాతో మాట్లాడుతూ జీ-20 దేశాల్లో చేరేందుకు దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సి ఉందని అన్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల పన్ను చెల్లింపుదారుల సంఖ్య 16 లక్షల నుంచి 32 లక్షలకు పెరిగిందని చెప్పారు. త్వరలోనే ఐటీ ఫైలింగ్ చేయని వారి క్యాటగిరీని రద్దు చేస్తామని, పన్ను చెల్లించని వారు ఇక నుంచి ఆస్తులను కానీ, వాహనాలను కానీ కొనుగోలు చేయలేరని ఆయన చెప్పారు.