ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan)-ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ వద్ద పాక్ భద్రతా దళాలు ఆదివారం గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ తర్వాత మిలిటెంట్ స్థావరాలు, సురక్షిత ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఆ దాడుల్లో సుమారు 29 మంది ఫైటర్లు మరణించినట్లు పాక్ అధికారి చెప్పారు. ఆ దేశ సమాచార శాఖ మంత్రి అయతుల్లా తారర్ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో జరుగుతున్న మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో సరిహద్దు వద్ద ఆపరేషన్ చేపట్టినట్లు మంత్రి అయతుల్లా పేర్కొన్నారు. అయితే ఈ దాడుల ఘటనపై ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ సర్కారు ఎటువంటి ప్రకటన చేయలేదు.
కరాచీలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై గన్నులు, పేలుడు పదార్ధాలతో మిలిటెంట్ల దాడి చేసిన మరుసటి రోజు ప్రభుత్వం మిలిటరీ కేంద్రాలను టార్గెట్ చేసిందిన్నారు. ఖైబర్ ఫక్తునక్వా ప్రావిన్సులో ఉన్న ఖైబర్ జిల్లాలో ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా పాక్ దళాలు గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఖాన్ ఫరోష్ అనే మిలిటెంట్తో పాటు మరో నలుగురు ఆ ఆపరేషన్లో ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లోని మూడు ప్రాంతాలపై వైమానిక దాడులకు పాల్పడింది. పక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ధ్వంసమైన ఉగ్ర క్యాంపులు.. జమాత్ ఉల్ అహ్రర్, ఫితనా అల్ ఖ్వారిజికి చెందినట్లు పాక్ మంత్రి తెలిపారు. సుమారు 25 మందికిపై మిలిటెంట్లను హతమార్చామని, అక్కడ నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి చెప్పారు.