ఇస్లామాబాద్: లైవ్ ఫైరింగ్ డ్రిల్స్ నిర్వహిస్తోంది పాకిస్థాన్. ఆ దేశ సైనిక బలగాలు.. యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక ఆయుధాలను పరీక్షిస్తున్నాయి. ప్రత్యర్థి దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టేందుకు పాకిస్థాన్ ఆర్మీ సిద్ధం అవుతున్నది. దానిలో భాగంగానే వార్ డ్రిల్స్ నిర్వహిస్తున్నది. సైనిక కసరత్తుల్లో అన్ని దళాలు పూర్తి స్థాయి ప్రొఫెషనల్ స్కిల్స్ ప్రదర్శిస్తున్నారు. ఆఫీసర్లు, సైనికులు ఆ డ్రిల్స్‌లో పాల్గింటున్నారు. యుద్ధ పరిస్థితుల్ని ఎదుర్కొనే రీతిలో సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది. అత్యాధునిక ఫైటర్ విమానాలు కూడా డ్రిల్స్ నిర్వహిస్తున్నాయని పాకిస్థాన్ వైమానిక దళం పేర్కొన్నది.
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, ఆ టెన్షన్ వాతావరణాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ దేశాలు జోక్యం చేసుకోవాలని పీపీపీ చైర్మెన్ బిలావల్ భుట్టో జర్దారీ కోరారు. ఒకవేళ ఇండియా దాడికి పాల్పడితే, దాన్ని తిప్పికొట్టేందుకు తమ దేశం సన్నద్దంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. సైనిక దళాలు, వైమానిక, నేవీ బలగాలు కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా ఉన్నట్లు చెప్పారు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పారదర్శక, నిష్పాక్షిక విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
భారత్‌తో ఉన్న ఉద్రిక్తత పరిస్థితిని తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పాకిస్థాన్ దౌత్యవేత రిజ్వాన్ కోరారు.