ఇస్లామాబాద్: భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నది. సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసిమ్ మునీర్‌కి ఫీల్డ్ మార్షల్‌గా మంగళవారం పదోన్నతి కల్పించింది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.భారత్‌తో పోరులో పాక్ బలగాలను ముందుండి నడిపించినందుకే ఆయన ప్రమోషన్ ఇచ్చినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
ఫీల్డ్ మార్షల్ అన్నది పాక్‌లో అత్యున్నత మిలిటరీ ర్యాంకు. పాక్‌లో ఈ హోదా పొందిన రెండో వ్యక్తి మునీరే కావడం విశేషం. ఇంతకుముందు 1959లో జనరల్ ఆయుబ్ ఖాన్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టారు. 2022 నవంబర్‌లో ఆర్మీ చీఫ్‌గా మునీర్ బాధ్యతలు చేపట్టారు. మునీర్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవలే మరిన్ని అధికారాలు కల్పించింది. మిలిటరీ కోర్టుల్లో పౌరులను విచారించేందుకు అనుమతించింది. తాజాగా ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి లభించడంతో మునీర్ ప్రాబల్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.