ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు మూడేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్సులో ఉన్న అటాక్ జైలులో ఆయన్ను ఉంచారు. అయితే ఇమ్రాన్ ఉంటున్న జైలులో నల్లులు, కీటకాలు ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా తేలింది. ఆ జైలులో సీ క్లాస్ సదుపాయాల్ని ఆయనకు కల్పించినట్లు ఇమ్రాన్ అటార్నీ నయీమ్ హైదర్ పంజోతా తెలిపారు. ఓ చిన్న రూమ్‌లో ఇమ్రాన్‌ను పెట్టినట్లు చెప్పారు.
ఆ జైలు రూమ్‌లో వాష్‌రూమ్ ఓపెన్ స్థలంలో ఉంది. తన జీవితాన్ని మొత్తం జైలులో గడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇమ్రాన్ పేర్కొన్నారని ఆయన తరపు అటార్నీ తెలిపారు. అరెస్టు వారెంట్ చూపించకుండానే ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఇమ్రాన్ రూమ్‌లో పొద్దున పురుగులు, రాత్రి పూట చీమలు తిరుగుతున్నట్లు లాయర్ ఆరోపించారు. ఆయన్ను డార్క్ రూమ్‌లో పెట్టారని, టీవీ కూడా లేదని, దినపత్రికలు కూడా లేవన్నారు. రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సుమారు 5 లక్షల డాలర్ల విలువైన విదేశీ బహుమతుల్ని అక్రమరీతిలో అమ్ముకున్నట్లు ఇమ్రాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.