ఇస్లామాబాద్: పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఆ దేశ పోలీసులు ముట్టడించారు. జాతీయ అసెంబ్లీలోకి చొరబడి ప్రతిపక్ష ఎంపీలపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు కొందరిని అరెస్ట్ చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విపక్ష పార్టీలు అవిశ్వాసం ప్రకటించాయి. దీంతో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ప్రతిపక్ష సభ్యులకు భద్రత కోసం విపక్ష పార్టీ జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఫజల్ (జేయూఐ-ఎఫ్) ప్రైవేట్ సెక్యూరిటీ అయిన అన్సరుల్ ఇస్లాం వాలంటీర్లను పార్లమెంట్ విశ్రాంతి గదుల వద్దకు రప్పించారు.
అయితే ఇది వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం పాక్ పార్లమెంట్లో పోలీస్ ఆపరేషన్ జరిగింది. జాతీయ అసెంబ్లీలోని సభ్యుల విశ్రాంతి గదుల వద్దకు పాక్ పోలీసులు వెళ్లారు. విపక్ష పార్టీ జేయూఐ-ఎఫ్‌కు చెందిన నలుగురు సభ్యులపై దురుసుగా ప్రవర్తించారు. వారిని ఈడ్చి కెళ్లి అరెస్ట్ చేశారు. అలాగే భద్రత కోసం పార్లమెంట్‌లోకి రప్పించిన సుమారు పాతిక మంది వాలంటీర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో పోలీస్ యాక్షన్‌పై ఆ దేశంలోని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. విపక్ష సభ్యల అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశాయి. అధికారం పోతుందన్న భయంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పార్లమెంట్‌పై పోలీస్ ఆపరేషన్ చేపట్టారని విపక్ష పార్టీలు విమర్శించాయి. కాగా, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.