టోక్యో: మానవులు ముక్కు, నోరు నుంచి మాత్రమే కాకుండా మలాశయం (రెక్టమ్) ద్వారా కూడా శ్వాస తీసుకోవచ్చునని జపనీస్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బట్ బ్రీథింగ్ పేరుతో ఈ చిట్కాను అభివృద్ధి చేశారు. ఈ విధానంలో మలాశయం నుంచి ఆక్సిజన్ శరీరంలోకి చేరుతుంది. ఆక్సిజన్‌తో కూడిన ద్రవ పదార్థాన్ని రోగి శరీరంలోకి మలాశయం ద్వారా పంపిస్తారు. ప్రేగుల ద్వారా ఆక్సిజన్ రక్తంలోకి చేరుతుంది.
ఈ పద్ధతి సురక్షితమైనదని తేలింది. ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడే రోగులకు ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం త్వరలో రానున్నది. చేపలు, కొన్ని రకాల తాబేళ్లు, వానపాములు తమ మలాశయం ద్వారా శ్వాస తీసుకుంటాయి. వీటిని ప్రేరణగా తీసుకుని ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. రిసెర్చర్ డాక్టర్ టముహికో టకెబె మాట్లాడుతూ, కొవిడ్ మహమ్మారి సమయంలో చాలా మంది రోగులు వెంటిలేటర్ల కొరత వల్ల మరణించారన్నారు. రోగులకు ఆక్సిజన్‌ను అందించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని తెలిపారు.