సిడ్నీ: తన వద్ద బాంబులున్నాయని ఒక విమాన ప్రయాణికుడు బెదిరించాడు (bomb threat). అలాగే విమానం సిబ్బంది మాట వినని అతడు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించాడు. దీంతో ఆ విమానం వెనక్కి మళ్లింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 122 విమానం సోమవారం మధ్యాహ్నం ఆస్టేలియాలోని సిడ్నీ ఎయిర్పోర్ట్ నుంచి మలేషియాకు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. సీటు పక్కనున్న ఖాళీ స్థలంలో చాప వేసుకుని ప్రార్థనలు చేశాడు. ‘నీవు అల్లా బానిసవా?’ అని పలువురిని అడిగాడు. విమాన సిబ్బంది జోక్యం చేసుకోగా తన వద్ద బాంబులున్నాయని బెదిరించాడు.
కాగా, ఆ ప్రయాణికుడి ప్రవర్తనతో అప్రమత్తమైన పైలట్లు, మూడు గంటల ప్రయాణం తర్వాత ఆ విమానాన్ని తిరిగి సిడ్నీకి మళ్లించారు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే ఆస్ట్రేలియా పోలీసులు ఆ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతడి వద్ద ఎలాంటి బాంబులు లభించలేదు. ఆ వ్యక్తిని పాకిస్థాన్‌కు చెందిన 45 ఏండ్ల మహ్మద్ ఆరిఫ్ అలీగా గుర్తించారు. అతడు మాజీ మోడల్, నటుడని పాక్ మీడియా సంస్థలు తెలిపాయి.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో సోమవారం సిడ్నీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ కావాల్సిన పలు ప్రాంతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని విమానాలు గంటన్నరపాటు ఆలస్యమయ్యాయి. అయితే అంతర్జాతీయ విమానాలను రద్దు చేయలేదని సిడ్నీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.