టొరంటో: కెనడా(Canada)లో గత అయిదేళ్లలో 1203 మంది భారతీయ పౌరులు మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2020- నుంచి 2024 మధ్య ఈ మరణాలు సంభవించాయి. చాలా వరకు మరణాలు ఓల్డేజ్ సమస్యలు, అనారోగ్యం వల్ల నమోదు అయినట్లు పార్లమెంట్లో ప్రభుత్వం పేర్కొన్నది. అయితే ఇదే సమయంలో సుమారు 757 మంది భారతీయులకు చెందిన భౌతికకాయాలను కెనడా నుంచి ఇండియాకు తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ తెలిపారు.
రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి కీర్తివర్దన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రికార్డుల ప్రకారం ఎంత మంది భారతీయలు కెనడాలో మృతిచెందారో చెప్పాలని విదేశాంగ శాఖను ఎంపీలు ప్రశ్నించారు. యాక్సిడెంట్లు, హింస, సూసైడ్లు, మర్డర్ల లాంటి అసహజ మరణాలు కూడా చోటుచేసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఏడాది సంభవించిన మరణాల సంఖ్యను వెల్లడించారు. 2020లో 120, 2021లో 160, 2022లో 198, 2023లో 336, 2024లో 389 మంది ప్రాణాలు కోల్పోయారు.