న్యూఢిల్లీ: 2023 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్ల వయసు దాటిన వంద కోట్ల మందికిపైగా చిన్నారులు లైంగిక వేధింపు(Women Violence)లకు గురైనట్లు ద లాన్సెట్ జర్నల్ తన నివేదికలో పేర్కొన్నది. ఇక సుమారు 60 కోట్ల మంది అమ్మాయిలు తమ రహస్య భాగస్వామి చేతిలో హింసకు గురైనట్లు ద లాన్సెట్ జర్నల్ తన రిపోర్టులో వెల్లడించింది. రహస్య భాగస్వామి హింస, లైంగిక వేధింపుల కేసులు ఎక్కువగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో నమోదు అవుతున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యల ఆధారంగా కూడా నిర్ధారణకు వచ్చారు. ఆ ఖండాల్లో ఎక్కువ హెచ్ఐవీతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు నమోదు అవుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
15 ఏళ్లు దాటిన మహిళలపై ఇండియాలో రహస్య భాగస్వాముల హింస సుమారు 23 శాతం ఉన్నట్లు తేల్చారు. 15 ఏళ్లు దాటిన సుమారు 30 శాతం మంది మహిళలు, 13 శాతం మంది పురుషులు తమ చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైనట్లు స్టడీలో తెలిపారు. గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజెస్(జీబీడీ) స్టడీ 2023 నివేదికలో ఉన్న డేటా ఆధారంగా పరిశోధకులు ఈ అంచనా వేశారు. రహస్య భాగస్వామి వల్ల కలిగిన వేధింపులతో ఎక్కువ శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు గుర్తించారు. చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైనవారిలో మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నదని నివేదికలో తెలిపారు. వారిలో మత్తు వాడకం, దీర్ఘకాలిక రుగ్మతలు వస్తున్నట్లు తేల్చారు.