మాస్కో: కొత్తగా తయారు చేసిన ఓరష్నిక్ మిస్సైల్(Oreshnik missile)ను కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా ప్రయోగించింది. ఈ కొత్త తరహా హైపర్సోనిక్ క్షిపణి గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని వివరాలు వెల్లడించారు. ఆ మీడియం రేంజ్ క్షిపణి.. ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణిస్తుంది. సోవియేట్ కాలం నాటి రష్యన్ మిసైల్ టెక్నాలజీతో దీన్ని తయారు చేయలేదన్నారు. కొత్త తరహా టెక్నాలజీతో ఆ క్షిపణిని రూపొందించినట్లు పుతిన్ వెల్లడించారు.
ఓరష్నిక్ క్షిపణులను భారీ మొత్తంలో ఉత్పత్తి ప్రారంభించినట్లు కూడా ఆయన తెలిపారు. కట్టింగ్ హెడ్జ్ హైపర్సోనిక్ టెక్నాలజీ, అత్యాధునిక వస్తువులతో ఆ క్షిపణిని తయారు చేశామన్నారు. కొత్త రష్యాలో ఆ కొత్త ఆయుధం రూపుదిద్దుకున్నట్లు చెప్పారు. ప్రస్తుత కాలాణుగున పరిస్థితుల్ని ఎదుర్కొనే రీతిలో దీన్ని తయారు చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం రష్యాలో ఓరష్నిక్ సిస్టమ్‌లకు టెస్టింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. రష్యాలోని వ్యూహాత్మక మిస్సైల్ దళాలకు ఆ కొత్త ఆయుధాలను అందించనున్నట్లు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్‌కు చెందిన రక్షణ క్షేంద్రం డిప్రోపెట్రోవిస్క్పై ఓరష్నిక్ మిస్సైల్‌ను ప్రయోగించినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లోని రక్షణ ఉత్పత్తులను తయారు చేసే కేంద్రాన్ని ఆ క్షిపణితో టార్గెట్ చేశారు. నాటో దేశాలు సరఫరా చేసిన మిస్సైల్‌తో ఉక్రెయిన్ అటాక్ చేసిన నేపథ్యంలో రష్యా కొత్త తరహా ఆయుధాన్ని వాడింది.
ఓరష్నిక్ క్షిపణితో చాలా కచ్చితమైన దాడి చేయవచ్చు. ఇటీవల జరిగిన ప్రయోగంలో అన్ని వార్‌హెడ్స్ అనుకున్న టార్గెట్లు చేరుకున్నట్లు పుతిన్ తెలిపారు. మిస్సైల్ సక్సెస్ అయిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సిస్టమ్ వేగాన్ని కూడా ప్రశంసించారు. మాక్ 10 వేగంతో ఈ మిస్సైల్ వెళ్తుంది. అంటే రమారమీ గంటకు 12 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ధ్వని వేగం కన్నా ఇది పది రెట్లు ఎక్కువ. అత్యంత వేగంతో వెళ్లే ఓరష్నిక్ క్షిపణిని అడ్డుకోలేరని పుతిన్ చెప్పారు.