కాబూల్, ఆగస్టు 20: తాలిబన్ల గత అరాచక వైఖరి ఇప్పటికీ కొనసాగుతున్నదని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది. అఫ్గానిస్థాన్‌లోని హజారా మైనారిటీ జాతికి చెందిన తొమ్మిది మంది యువకులను తాలిబన్లు అత్యంత కిరాతకంగా హతమార్చినట్టు వెల్లడించింది. ఇందులో ఆరుగురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, మరో ముగ్గురిని హింసించి చంపారని వివరించింది. జూలై 4-6 తేదీల మధ్య ఘజ్నీ ప్రావిన్సులోని ముందారఖట్ గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకున్నదనితెలిపింది. అఫ్గాన్ అంతటా ఇలాంటి అమానుష ఘటనలు జరుగుతున్నాయని, అయితే వీటిని బయటి ప్రపంచానికి తెలియజేయకుండా ఆయా ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు, సెల్‌ఫోన్ సర్వీసుల్లో కోతలు విధిస్తున్నట్టు తెలిపింది.
పేల్చేయడమే తరువాయి!
అఫ్గాన్ దళాలకు అమెరికా అందజేసిన వందల కోట్ల విలువైన ఆయుధాలు ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. కీలకమైన ఆయుధాలను బాంబులతో పేల్చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు, తాలిబన్ల చేతుల్లోకి అమెరికా ఆయుధాలు వెళ్లడంపై బైడెన్ సర్కార్‌దే బాధ్యతని రిపబ్లికన్ సెనేటర్లు ఆరోపించారు.
పాక్ ఆర్మీ కస్టడీలో తాలిబన్ లీడర్!
అఫ్గానిస్థాన్‌ని తాలిబన్లు ఆధీనంలోకి తీసుకొని వారం కావొస్తుంది. అయితే, ఆ గ్రూప్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా మాత్రం ఇంతవరకూ మీడియా ముందుకు రాలేదు. అయితే, ఆయన పాకిస్థాన్ సైన్యం ఆధీనంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు, కాందహార్, హెరాత్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాల్లో తాలిబన్లు సోదాలు జరిపారని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని అధికారులు తోసిపుచ్చారు.
తాలిబన్ల ఇంటింటి వేట..
అమెరికా, నాటో దళాలకు సహకరించిన జర్నలిస్టులు, పౌరుల కోసం తాలిబన్లు ఇంటింటికీ వెళ్లి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మన్ వార్తాపత్రిక ‘డీడబ్యూ’లో పనిచేసే జర్నలిస్ట్ కుటుంబసభ్యుడు ఒకరిని తాలిబన్లు హత్య చేసినట్టు సమాచారం. మరోవైపు, అంతర్జాతీయ సమాజం తమ ఉనికిని గుర్తించాలని తాలిబన్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్ల ఆధీనంలోకి అఫ్గాన్ వెళ్లగానే ఆ దేశ కరెన్సీ 6 శాతం పడిపోయింది.
31 తర్వాతనే ప్రభుత్వ ఏర్పాటు!
అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిస్థాయిలో వైదొలిగిన తర్వాతనే తాలిబన్ల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని సంబంధితవర్గాలు తెలిపాయి. ఒప్పందం ప్రకారం.. ఈ నెల 31న అఫ్గాన్ నుంచి అమెరికా దళాలు వైదొలగాల్సి ఉన్నది.