ప్రపంచం మొత్తాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్ చాలా ప్రమాదకారి అని యూకే ప్రభుత్వం హెచ్చరించింది. ఒమిక్రాన్ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయొద్దని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా హెచ్చరించింది.
ఇప్పుడు తాజాగా యూకే వైద్యశాఖ కూడా ఇదే విషయాన్ని మరింత గట్టిగా చెప్పింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని యూకే చీఫ్ మెడికల్ ఆఫీసర్ క్రిస్ విట్టీ సూచించారు. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోందని ఆయన హెచ్చరించారు.
‘ఈ వేరియంట్ గురించి మనకు చాలా విషయాలు తెలియవు. కానీ ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయాలు మాత్రం భయం కల్పించేవే’ అని ఆయన అన్నారు. కాగా యూకేలో ఒమిక్రాన్ కారణంగా ఒక వ్యక్తి ఇటీవలే మరణించాడు. ఈ నేపథ్యంలోనే ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్.. దేశంలో ఒమిక్రాన్ ఎమర్జెన్సీ ప్రకటించారు.