ఇస్లామాబాద్, జూలై 20: మన పొరుగు దేశమైన పాకిస్థాన్లో నివసిస్తున్న హిందూ జనాభా సంఖ్య పెరుగుతున్నది. ఈ ఇస్లామిక్ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులు గత ఏడాది నిర్వహించిన జన గణన ప్రకారం దేశంలోనే అతిపెద్ద మైనారిటీ వర్గంగా నిలిచారు. పాక్లో 2017లో హిందువుల సంఖ్య 35 లక్షలు ఉండగా, 2023 నాటికి ఆ సంఖ్య 38 లక్షలకు పెరిగింది. అయితే అదే సమయంలో మొత్తం జనాభాలో వారి శాతం 1.73 నుంచి 1.61కు తగ్గింది.
అంటే మిగతా మైనారిటీల జనాభా వేగంగా పెరుగుతున్నట్టు అర్థమవుతున్నది. అలాగే ఆ దేశంలో క్రైస్తవుల సంఖ్య కూడా 26 లక్షల నుంచి 33 లక్షలకు పెరిగింది. గత ఏడాది పాకిస్థాన్లో నిర్వహించిన 7వ జనాభా, గృహ గణన వివరాలను పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇటీవల విడుదల చేసినట్టు డాన్ పత్రిక వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం 2023 నాటికి ఆ దేశ జనాభా 24కోట్లుగా నమోదైంది. ఆ దేశంలో ముస్లింల జనాభా 2017 (96.47 శాతం)తో పోలిస్తే 2023 (96.35 శాతం) నాటికి స్వల్పంగా తగ్గింది. ఆ దేశంలోని అన్ని మైనారిటీ కులాల వారి జనాభా గత ఆరేండ్లుగా పెరిగింది. అయితే మొత్తం జనాభాతో పోలిస్తే వారి శాతం అతి స్వల్పం.