లండన్: భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) (94) లండన్‌లో కన్నుమూశారు. వయోసంబంధిత అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న గత కొన్నిరోజులుగా దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన గురువారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) తుదిశ్వాస విడిచారు. కపారో గ్రూప్ వ్యవస్థాపకులైన స్వరాజ్ పాల్.. 1931, ఫిబ్రవరి 18న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు. అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. అనంతరం తన తండ్రి స్థాపించిన కుటుంబ వ్యాపార సంస్థ అపీజే గ్రూప్‌లో పనిచేసేందుకు భారత్‌కు తిరిగి వచ్చారు. అయితే 1966లో క్యాన్సర్‌తో బాధపడుతున్న తన చిన్న కూతురు అంబికా పాల్ చికిత్స కోసం లండన్‌కు మకాం మార్చారు. మరుసటి ఏడాది ఆమె మృతించెందింది.
అనంతరం 1968లో యూకేలో కపారో గ్రూప్‌ను ప్రారంభించారు. అనంతరం కంపెనీని భారత్, అమెరికా, కెనడా, యూఏఈలకు విస్తరించారు. 1975లో బ్రిటన్, భారత్ మధ్య మెరుగైన సంబంధాల కోసం ఇండో-బ్రిటిష్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. 2009, అక్టోబర్‌లో ప్రైవీ కౌన్సిలర్‌గా నియమితులయ్యారు.